Notes On Culture

సనాతన భారతానికి రక్షణ ఈ నాలుగు స్తంభాలే

Sandeep Balakrishna, Translator: రామేశ్వరం జి

Read this article in English

మొట్టమొదట ఈ గడ్డపై కాలిడిన ఐరోపా వాసులు, వారికి కనిపించిన వైవిధ్యానికి ఆశ్చర్య చకితులయ్యారు. నేటికీ కూడా మొదటిసారి ఈ దేశానికి వచ్చిన ప్రతి విదేశీ యాత్రికుడు అదే వైవిధ్యాన్నిదర్శించి అచ్చెరువొందుతూనే ఉన్నాడు. ఈ విషయం విదేశీయులు ప్రచురించే 'భరత యాత్రాదర్శిని' పుస్తకాలలో పదే పదే ఉటంకించబడింది. అంతేకాదు, ఇంతటి వైవిధ్యమున్న ఈ దేశములో, ఎన్నో తరగతుల ప్రజలు శాంతిగా జీవిస్తూ ఉండడం వాళ్ళ ఊహలకు అందని విషయం; ఇలా సంభ్రమాశ్చర్యలకు గురైన ఐరోపావాసులు ఈ దేశానికి ఉపఖండమనే ముద్ర వేశారు. మనకు అది ఆనందం కలిగించే విషయమైనా, వాళ్ళకు బోధపడని ఈ దేశ వైవిధ్యానికి, ఉపఖండమనే బిరుదుతో సత్కరించి తమను తాము సమాధాన పరచుకున్నారని అనుకోవచ్చు.

వేరే ఏ దేశమైనా ఇందులో పదో వంతు వైవిధ్యం కనబరచినా విచ్ఛిన్నమై ఉండేది. అలా జరగలేదంటే అంతర్లీనముగా ప్రవహిస్తున్న భారతీయతయే ఇందుకు కారణమని నిస్సంకోచముగా చెప్పవచ్చు.

ఇటువంటి భారతీయత మూలాలు హిందూ ధర్మంలో ఉన్నాయి. ఈ సార్వజనీనత ఏ విధముగా ప్రకటితమౌతున్నదో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

మన దేశము

ముందు పేరుతో మొదలుపెడదాం. ఇండియా అని పిలువ బడుతున్నఈ దేశము భారతవర్షము లేదా భారత్ గా సుప్రసిద్దము, ఆరాధ్యము. కాల - స్థల పరంగా కూడా మనదేశానికున్న ప్రశస్తి వేరే ఏ దేశానికి లేదు. ఒక అర్థంలో ' వర్ష ' అంటే భూభాగము(భారత వర్షము లో లాగా ) మరో అర్థములో 'వర్ష ఋతువు' వర్షాలను సూచించే కాలము. స్థల - కాల పరిమితులను అధిగమించిన దేశం , మనది. ఆ లక్షణమే భారతీయ జీవన శైలిలోకూడా - తాత్వికంగా - ప్రాపంచికంగా భాగమైపోయింది. అందుచేతనే భారతభూమి పవిత్ర భారత దేశమయ్యింది. వేరే ఏ సంస్కృతిలో దేశాన్ని దేశమాతగా పూజించడం ఉండదు. ఎన్నో పవిత్ర తీర్థాలతో , యాత్రాస్థలాలతో , స్థలపురాణాలతో ఆధ్యాత్మిక భూమిగా ఔన్నత్య భూమిక కలిగిన దేశమే భారతవర్షము. ఆ విషయాలు కొంత దీర్ఘంగా పరిశీలన చేస్తాను.

సనాతన సంస్కృతి నిలబెట్టే నాలుగు స్తంభాలు

భారతదేశము మానవజాతికి ప్రసాదించిన తాత్త్విక , సాంస్కృతిక మూలాలు నాలుగు ఉన్నాయి. అవి నేటికీ తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. మనము గుర్తించినా , గుర్తించక పోయినా అవి భారతీయ సాంస్కృతిక చైతన్యంలో పొదగబడి ఉన్నాయి. అవి - ఋతము - సత్యము - ధర్మము - ఋణము. ఋతం అనగా విశ్వ వ్యాపక స్థితి . అంటే విశ్వములో నున్న గ్రహాలు , సౌర మండలము, భూమిలోపల, వెలుపల ఆశ్రయించుకొని వున్న జీవజాలము, నీరు గాలి , స్థావర జంగమములు - ఒక క్రమ పద్ధతిలో నడిపింపబడుతున్న క్లిష్టమైన విధానము, అంతేకాదు మానవులు మార్చుటకు ప్రయత్నించకూడని విశ్వ వ్యవస్థ , ఇదే ఋతము

దీనినుండి ధర్మము యొక్క నిర్వచనాన్ని ప్రాప్తించవచ్చు. ఋతము ను ధరించి భరించే మానవ పరిభాష ఏదైతే ఉందో అదే ధర్మము. మరో విధంగా చెప్పాలంటే ధర్మము అనేది ఒక పద్దతి, కొన్ని సూత్రాలు, నియమాలు - అన్నిటి లక్ష్యం విశ్వ వ్యవస్థకు మానవులచే అతి తక్కువ హాని జరుగునట్టు చూడడమే. అందుచేత ఎన్నో విధాలయిన ధర్మాలు చెప్పబడ్డాయి. అన్ని ధర్మాలు విశ్వవ్యాప్తముగా అమలులో ఉంటాయనిగాని, అవే శాశ్వత ధర్మాలనీ చెప్పలేము.ధర్మము అనే పదము యొక్క నిర్వచనం- 'ధారణాత్ధర్మ యిత్యాహుః ' - అనగా - రక్షించేది, అండగా నిలిచేది , పోషించేది , భరించేది ఏదో అదేధర్మము.

తరువాత మనం గమనించాల్సింది, ఋణం - అనగా అప్పు. ఋణము కూడా ధర్మానికి, ఋతానికి అనుబంధమైనదే. భారతీయులు మూడు రకాలైన ఋణాలను గుర్తించారు. ఒకటి, దేవఋణం - దేవతలకు ఋణపడి ఉండడం , రెండవది ఋషిఋణం- ఋషులకు ఋణపడి ఉండడం , మూడవది పితృ ఋణం - తల్లిదండ్రులకు ఋణపడి ఉండడం .ఇందులో మనం అర్థం చేసుకోవలిసినది, - మనము పుట్టడంతోటే ఋణగ్రస్తులము,మనం చేస్తున్న సత్కార్యాల ద్వారా మాత్రమే ఈ ఋణం తీరుతుంది.

ఉదాహరణకు, మన పట్టణాలలో, నగరాలలో ఉన్న మంచినీటి సరఫరా వ్యవస్థను పరిశీలిద్దాం. ఉన్నట్టుండి, ఎటువంటి హెచ్చరిక లేకుండా నీటి సరఫరా రెండు వారాలపాటు ఆగిపోయిందనుకుందాం. అప్పుడు మనమేం చేస్తాము , తిట్టుకుంటూనో తిమ్ముకుంటూనో మున్సిపల్ నీటి సరఫరా అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ప్రైవేట్ వ్యాపారులనుండి మళ్ళీ నీటి పునరుద్ధరణ జరిగేవరకు నీళ్ళు కొనుగోలు చేస్తాం. ఎక్కడో నీటి గొట్టం పగిలిపోయింది, ఎవరూ పట్టించుకోలేదు, అందువల్ల ఇలా జరిగిందని ప్రభుత్వం అంటుంది. నీటి సరఫరా శాఖ తప్పిదం వలన జరిగిందని స్పష్టంగా తెలిసింది, కాని వాళ్ళు పట్టించుకోలేదు. ఈ సన్నివేశాన్ని వెనుకనించి వరుసక్రమంలో ప్రశ్నలతో ఋత , ఋణ , ధర్మముల పరిశీలన చేద్దాము ప్రశ్న। ప్రభుత్వ యంత్రాంగం పగిలిన నీళ్ళ గొట్టాలను వెంటనే ఎందుకు సరిదిద్దలేక పోయింది ?

జవాబు : వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి.

ప్ర. ఎందుకు పట్టించుకోలేదు ?

జ. వాళ్ళకు జవాబుదారీతనము ఉన్నది అని అనుకోలేదుకాబట్టి

ప్ర . ఎందుకు జవాబుదారీతనము లేక పోయింది ?

జ. విధినిర్వహణ పట్ల వివేకము లోపించింది కాబట్టి.

ప్ర . విధినిర్వహణ పట్ల వివేకము ఎందుకు లోపించింది ?

జ.సమాజము పట్ల ఋణము తీర్చుకోవాలనే భావన మర్చిపోయారు ,లేదాఅటువంటి ఆలోచనే కలుగ లేదు. ఋణము చేతనైనంతలో తీర్చుకొనే ప్రయత్నముసమాజంలో జరిగితే సమాజము, తద్వారా దేశము నైతికంగా, సమరసభావంతోవృద్ధిపథంలో ముందుంటుంది.స్వాతంత్ర భారతంలో నేడు మనం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం మనము మనముంటున్నసమాజానికిఋణపడి ఉన్నామనే భావన లోపించడం. సమతౌల్య లోపము వలనసమాజంలోఅపశృతులు చోటుచేసుకుంటున్నాయి.

ప్ర . ఆ భావన ఎందుకు కోల్పోయాము ? ఋణభావన ఎలా తెలియకుండా పోయింది ?

జ. ఋణభావనకు మూలమైన ధార్మిక భావన మరుగున పడినందువలన

ప్ర . ధార్మిక భావన ఎందుకు కోల్పోయాము ? ధార్మిక భావన ఎలా తెలియకుండా పోయింది ?

జ . విశ్వవ్యవస్థ స్థితికి, సృష్టి నియమాలకు కారణభూతమైన 'ఋత'మనే భావనను వదిలివేశాము.దానికే ఉపాంగమైన ధర్మాన్ని పాటించడం మానేశాం . సృష్టి నియమాలకు హాని ఎంత తక్కువ జరిగితే అంత మంచిది అప్పుడే ధర్మము యొక్క పునాదులు కదలకుండా నిలబడుతాయి.

ఋతంతో మొదలు పెట్టిన నాలుగు తాత్విక సాంస్కృతిక మూలాలు నాగరిక జీవ లక్షణమైనప్పుడు మాత్రమే , నైతిక విలువలతో సామరస్య పూర్ణమైన సమాజము నిర్మాణమౌతుంది. కఠినమైన చట్టాల వలన ఇటువంటి మార్పును ఆశించలేము. ఈ విషయాలను ఆటవిక నమ్మకాలుగా కొట్టివేసే వికృత విద్యా వ్యవస్థ నేడు అమలులో ఉన్నది.

భారతీయ నాగరికత , సంస్కృతి -హక్కులు, చట్టాల కన్నా ధర్మముతో కూడిన విధినిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చింది. హక్కులు చట్టాలపై ఆధారపడిన ప్రతి సమాజము,ఏ విషయాన్నైనా సమన్వయ దృష్టిలేక ప్రతికూల దృక్పథముతోనే పరిశీలిస్తుంది .

The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.