ఒక వృద్ధ స్త్రీ - బృహదీశ్వరాలయం - అజ్ఞాత ఘటన

ప్రాచుర్యంలో లేని ఒక కథ – తంజావూర్ బృహదీశ్వరాలయం దర్శించిన ఒక వృద్ధ స్త్రీ
ఒక వృద్ధ స్త్రీ - బృహదీశ్వరాలయం - అజ్ఞాత ఘటన

భరతవర్షము యొక్క సుదీర్ఘ నాగరిక చరిత్రలో అతి దారుణముగా నిరాదరణకు గురైన ఒక అసమానము, అవిచ్ఛిన్నము గా సాగి పురోగామిగా వున్నచరిత్ర - రెండువేల సంవత్సరాల నౌకావాణిజ్య చరిత్ర. రోమునుంచి వచ్చిన బంగారం భారతవర్షం అంతటా వ్యాపించినా ఐశ్వర్యముతో తులతూగుతున్న శాతవాహనుల సామ్రాజ్యంలో మరీ విస్తృతంగా వ్యాప్తి చెందింది.

నాణ్యమైన భారతీయ పట్టు వస్త్రాలను , అద్దకపు రంగులను , శ్రేష్టమైన సుగంధ ద్రవ్యాలను రత్నాలను మణులను రోమను సామ్రాజ్యం బంగారం వినిమయం ద్వారా కొనుగోలు చేసేది.

భారత నౌకావాణిజ్య చరిత్రలో మరో విశిష్ట అధ్యాయం ఇంచుమించు ఘన చరిత్ర గల గుప్తులతో ప్రారంభం అవుతుంది. నేటి వరకు నిలదొక్కుకొని నిలిచిన సనాతన నాగరికత, సంస్కృతుల సకల వైభవ విశేషాలకు విస్తృతమైనపునాదులు నిర్మించిన వారు వారే.

ఉత్తరభారతం అరబ్బు , తురుష్క ముష్కరుల పాలైన అనంతరం దక్షిణ భారతంలో మరొక శకం ఆరంభమైంది. శకలమైన చోళ సామ్రాజ్యాన్ని ఏకీకృతం చేసిన ఒకటవ రాజరాజు సముద్రవాణిజ్య వ్యవహారాలలో తన దక్షతను చూపించడం ద్వారా సంపద వినిమయము పెరిగింది , సంపద వృద్ధి కూడా జరిగింది. సింధు మహాసాగరం మొదలుకొని తూర్పున బంగాళాఖాతం కోస్తా ప్రాంతమంతా కళింగదేశం వరకు ఈయన ఆధిపత్యం కొనసాగింది. ఇదంతా కేవలం ఇరవైతొమ్మిది సంవత్సరాలలోనే జరిగింది.

ఈ ఇరవైతొమ్మిది సంవత్సరాలలో రాజరాజు ధర్మ ప్రభువు గా కూడా ప్రసిద్ధి చెందాడు.తన వైవిధ్యభరితమైన విజయాలతో సనాతన సమ్రాట్టులలో, ఒక హిమోన్నత శిఖరంగా పరిగణన పొందాడు. తన పరిపాలనలో అమలులోకి తెచ్చిన సమూలమైన వ్యవస్థా గత సంస్కరణలు ఆయన సునిశిత మేధా సంపత్తికి తార్కాణాలు. విశాలమైన తన సామ్రాజ్యాన్ని ‘ వలనాడు’ లనే పరిపాలక విభాగాలుగా వ్యవస్థీకరించి ప్రతిగ్రామానికి అత్యధికమైన స్వయం ప్రతిపత్తిని ప్రసాదించాడు. ఆ నాటి గ్రామ వైభవపు ఆనవాళ్ళు దాదాపు అంతరించినా, తక్కువలో తక్కువైనా నేటికీ తమిళనాడు రాష్ట్రంలో మిగిలి ఉన్నాయి.

రాజరాజ చోళుడు - సనాతనధర్మ ప్రభువు

రాజరాజ చోళుడు సనాతన ధర్మావలంబి అయిన ప్రభువు. ప్రపంచంలో ఆయనను ఎన్నో బిరుదులు వరించినప్పటికీ అనగా - రాజకేసరి , ముమ్ముడి చోళ [ చోళ , పాండ్య, చేర కిరీటధారి], రాజరాజ చోళ అని గౌరవించినప్పటికీ, శివపాదములందు శిరసుంచిన ‘ శివపాద శేఖరుని’ గా తనను తాను భావించుకొనేవాడు. ఆయన విశిష్ట శివ భక్తుడు కావటమే కాదు, ఆయన లేకపోతే నేడు మనకు తెలిసిన నాయనార్ల విశేషాలు పూర్తిగా అంతరించి పోయి ఉండేవి. ఆయనకున్న కలికితురాయి వంటి బిరుదు , తిరుమురై కండ చోళన్ [ శివస్తుతుల సంకలనమైన ‘తిరుమురై’ దర్శించి లోకానికి ప్రసాదించిన చోళుడు] ఆయనకు పవిత్రమైన ఆభరణము వంటిది. నూరు సంవత్సరాల క్రూర ద్రవిడ ఉద్యమాలు , క్రైస్తవ మిషనరీల దురాగాతాలున్నప్పటికీ అటువంటి సమ్రాట్టులు, సాధు సంతులు, కవులు, సన్న్యాసులు, వీధిభాగవతులు - వలననే నేటికీ సనాతన సంస్కృతి సంప్రదాయాలు సజీవంగా ఉండి తమిళనాడులో రక్షించబడ్డాయి.

రాజరాజ చోళుని శివభక్తిని శిఖరాగ్రస్థాయి తార్కాణమే తన రాజధాని తంజావూరులో అతడు నిర్మింపజేసిన బృహదీశ్వరాలయం. ఈశ్వర భక్తిని మలచగా అది బృహదీశ్వరాలయమైనది అనవచ్చు. ఒక వీక్షణంలోనే ఆ ఆధ్యాత్మిక నిర్మాణం మనలోని అంతరాంతరాలలోని మహనీయ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది. ఇప్పటికి కాలక్రమంలో ఆ ఆలయం వయస్సు 1010 సంవత్సరాలు కావచ్చు, కాని దైవ సంకల్పం తో కూడిన ఈ ఘటన ఆ ఆలయ దైవత్వాన్ని చాటేందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

దైవ ఘటన

బృహదీశ్వరాలయం నిర్మాణం పూర్తయింది. ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలలో , ఒకటే మిగిలి పోయింది. పూజ ఆరంభం చెయ్యడానికి ముందుగా ఆలయ ఘంటానాదం చెయ్యవలసి ఉన్నది. అతి పెద్ద ఆలయానికి అతి పెద్ద ఘంట. ఘంటకు కట్టిన త్రాడును ఎవరు లాగినా గంట మ్రోగడం లేదు. సాయంకాలం కావస్తున్నది. భక్తితో అక్కడి వారందరూ చేసిన ప్రార్థనల ఫలితముగా అక్కడే ఉన్న ఒక భక్తుని ద్వారా ఈశ్వరుని సందేశం వచ్చింది. ఆలయనిర్మాణం కోసం కృషి చేసిన నిజమైన భక్తుడు గంటలాగితేమాత్రమే మ్రోగుతుంది అనే వార్త వినబడింది.

సహజంగానే రాజారాజ చోళ మహరాజునే గంట లాగి మ్రోగించమని కోరారు. ఆయన లాగి చూశాడు ఏమీ కదలిక లేదు. ప్రధానార్చకుల వారు లాగి ప్రయత్నం చేశారు , ఊహుఁ, ఏ ప్రయోజనము లేదు. అన్ని రకాల భక్తులు, సంతులు, సాధువులు , సన్న్యాసులు, దాతలు, శిల్పులు, పనివాళ్ళు, ఎందరెందరో ప్రయత్నాలు చేశారు. ఫలితం శూన్యం.

సాయకాలం కరిగిపోయి రాత్రిలో లీనమయ్యింది. ప్రజల్లో భయం ఆవరించింది. ఎక్కడో మహాపరాధం జరిగింది. మహా మంగళ హారతి ఇవ్వాల్సిన సమయం దగ్గరపడుతున్నది. మహా మంగళ హారతి అయితేనే ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రసాద వితరణ తర్వాతనే అన్నదానం, అనగా రాత్రి భోజనం, జరగాలి. ఇవన్నీ కూడా గంట మ్రోగిన తర్వాతజరగాల్సినవే. ఆ సమయంలో ఊహించని సంఘటన - ఒక వృద్ధ స్త్రీ మహాద్వారానికి తల ఆనించి, నమస్కరించి గంట కున్న త్రాడును లాగింది , ఆశ్చర్యం - బృహదీశ్వరాలయ ప్రాంగణం అంతా సుశ్రావ్యమైన బృహద్ఘంటానాదంతో మార్మ్రోగిపోయింది.

విశాలమైన ఆలయ ప్రాంగణమంతా నిండి ఉన్న భక్త జనులు చేష్టలుడిగి మ్రాన్పడి నిలుచున్నారు. వాళ్ళందరిలో మనసులో మెదిలి వ్యక్తంకాని ఒకే ప్రశ్న , ఎవరీ స్త్రీ ? ఇదివరకు ఎప్పుడూ చూసినట్లే లేదు. ఒకవేళ చూసిఉన్నా గుర్తుపెట్టుకోదగిన లక్షణాలేవీ లేవు. ఎవరో ఒక దారిన పోయే దానమ్మ, అంతే పల్లెటూరి ముఖం. ఒక బీద రైతు భార్య కావచ్చునేమో. లేదా పూట గడవడానికి కూలి-నాలి చేసుకొనే మనిషేమో? ఎవరికీ అంతుపట్టటం లేదు. బృహదీశ్వరుడు, అనంత శక్తివంతుడైన ఈ మహాదేవుడు ఈ ఆలయ నిర్మాణానికి నిజమైన కృషి సల్పిన వ్యక్తిగా ఈమెను గుర్తించాడు.

వేరే చెప్పాల్సిన పనిలేదు, అందరి కళ్ళు ఆమెనే చూస్తున్నాయి. రాజరాజ చోళ మహారాజు ఆమె వద్దకు వెళ్లి భక్తితో నమస్కరించాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆమె ఏవిధంగా ఆలయ నిర్మాణానికి తోడ్పడిందో తెలుసుకోవాలనే ఉత్కంఠతో ఉన్నారు, తెలుసుకొని భవిష్యత్తులో వారు ఆచరించవచ్చు కదా అని ఆశతో ఉన్నారు.

అమాయకురాలైన ఆ ఆడమనిషి ఉన్నట్టుండి ఇంతమంది ప్రజలు ఆశ్చర్యచకితులై చూడడంతో భయభ్రాంతురాలైంది. మామూలు అందరు భక్తులవలెనే తన ప్రయత్నం చేసింది, రోజంతా జరిగిన విషయం ఆమెకు తెలియనే తెలియదు. అమ్మా మీరెక్కడ ఉంటారు , ఏమి చేస్తూవుంటారు, మీ జీవన విశేషాలేమిటి అని అనేక ఆరాలు తీశారు,ఆమె ఇచ్చిన సమాధానాలు ఆమె సాధించినఅలౌకిక విశేషానికి పొంతన లేకుండా ఉన్నాయి.

బృహదీశ్వరాలయ శిఖరం 25 టన్నుల బరువుండి, 80 టన్నుల బరువున్న భారీ నల్లరాయి పైన నిలబడి ఉన్నది. 45 ఎకరాల్లో విస్తృతంగా వ్యాపించిన ఆలయ సముదాయ నిర్మాణంలో ఇది ఆవగింజ మాత్రమే అనుకున్నా , ఆలయం ప్రమాణము, పరిమాణము , విస్తీర్ణము మనకు ఆ బృహన్నిర్మాణము యొక్క భావనను కలుగజేస్తుంది. అదే ఒక చిన్న గ్రామంతో సమానం. ఆ కాలానికి సుదూరంగా ఉన్న మనకు, యాంత్రిక సౌకర్యాలు లేని కాలంలో అంతటి బృహదాలయాన్ని నిర్మించారనే విషయం మన ఊహకందని విషయం…...అసంఖ్యాకమైన గండరాళ్ళు ఎంతెంతో దూరాలనుంచి తరలించి, తీరుగా నిర్దుష్టతతో మలచి తేడాలు లేకుండా కలిపి నిర్మాణం చేసిన విధానం అద్వితీయం … ఎంతటి నాణ్యతతో చేసిన నిర్మాణమో, కాబట్టే వెయ్యి సంవత్సరాలు దాటినా స్థిరత్వాన్ని కోల్పోలేదు. ఆలయ నిర్మాణానికి పదునైదు సంవత్సరాలు పట్టింది.

కొంత బుర్రలు బద్దలు కొట్టుకొని , లోతుగా ఆరా తీసిన తరువాత ఆ అలౌకిక ఘటనకు సమాధానం లభించింది.

ఆమె సామాన్య కుటుంబానికి చెందిన అతి సాధారణ మహిళ. ఆమె నిజంగా బృహదీశ్వర ఆలయం నిర్మాణం ఆమె యే చేసిందనడం ఆమె జీవితమంత సాధారణ విషయం. పదునైదు సంవత్సరాలపాటు అక్కడే నీళ్ళు తొట్టినిండా నింపుకొని రహదారి వద్ద తీక్ష్ణమైన మధ్యాహ్నపు టెండలో నిలుచుని ఉండేది.ఆలయ నిర్మాణానికి కొండల్లాంటి శిలలను చేరవేసే ఎద్దులబండి వాళ్ళు తప్పనిసరిగా ఆగి ఎద్దులను విడిచేవాళ్ళు. ఆ ఎద్దులన్నీ దాహం తీర్చుకొనేంతవరకూ ఆ తొట్టిలో నీళ్ళు తెచ్చి పోస్తూనే ఉండేది. ఎద్దులన్నీ దాహం తీర్చుకొని కొంత విశ్రాంతి తీసుకొని బయలుదేరేవి. బృహదీశ్వర ఆలయం నిర్మాణంలోభాగస్వాములైనమూగజీవులకు ఆమె చేసిన ఉపకారానికి, స్వామి వారు ఆ గుర్తింపు కలగజేసి మొదటి ఘంటానాదం ఆమె చేతులమీదుగా జరిపించాడు.

చివరి వ్రాత

ఇటువంటి అసంఖ్యాకమైన కథనాల్లో దీనిని కల్పనగానూ , ప్రాంతీయ గాధగానూ త్రోసిరాజనవచ్చు. ఎందుచేతనంటే సమకాలీన బౌద్ధిక స్థితి ఇటువంటి ఘటనలపై తిరస్కారభావనలతో కూడిన ఎడారిగా మారింది, అక్కడ శాశ్వత విలువలు మొలవవు. కాని గమనించండి, మనం ఏకంగా బుద్ధినే కృత్రిమ మేధతో మార్పిడిని ఉన్మాదోత్సాహంతో అనుసరించే యుగంలో జీవిస్తున్నాము. చివరిగా మనలోని ఆధ్యాత్మిక ఔన్నత్యము చేజేతులా నిర్మూలించబడడమే పర్యవసానమేమో.

(ఎన్నో సంవత్సరాల క్రితం ఈ గాధను వినిపించిన శతావధాని డాక్టర్ గణేష్ గారికి ఎంతో ఋణపడి ఉన్నాను.)

The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.

No stories found.
The Dharma Dispatch
www.dharmadispatch.in