నేటి కాలంలో ఋషిగా కీర్తించదగిన డీ వీ గుండప్ప , అనగా కర్ణాటకలో, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కన్నడిగులకు కూడా చిరపరిచితమైన డీవీజీ గారు పుట్టినరోజు ఈ రోజు . ఒక తత్త్వవేత్త గా , భాషావేత్తగా , జాతీయవాదిగా , ఒక శతాబ్దపు భారతవర్ష జాతీయ పునరుజ్జీవన సంస్కృతిని చరిత్ర పుటలలోకి ఎక్కించిన ఘనుడిగా చిరస్మరణీయుడు డీవీజీ రమారమి 1970ల నాటి చీకటి దశాబ్దాలలో మొదలై నెటివరకూ డీవీజీ రచించిన మహా కావ్యం - 'మంకుతిమ్మన కగ్గ ' మకుటాయమానమైన సాహిత్య సృష్టిగా, కన్నడిగులకు, భగవద్గీత లాగా కొనియాడబడుతోంది.
ఆయన జీవిత కాలము (1887 – 1975)లో, ఆయన ఆవిశ్రాంతముగా ప్రజా జీవితంలో , సంస్కృతీరంగాలలో కృషిచేస్తూ ఉండేవారు - పత్రికా వ్యాసంగం, రాజనీతి , విధాన రచన , ధర్మము , తత్త్వశాస్త్రము , సాహిత్యము , విద్యారంగము, ఆర్థిక సామాజిక సంస్కరణలు - ఒకటేమిటి ఆయన స్పృశించని వస్తువు లేదు. 12000 పేజీలు దాటిన వారి రచనా భండాగారం లో ఎన్నో ఆలోచనలు , ఉద్యమాలు, తాత్విక సాంస్కృతిక ప్రవాహాలు, ప్రజా సమస్యలు - ఒక్క మాటలో భారతదేశ చరిత్ర అంతా వారి రచనాలలోనే నిక్షిప్తమై ఉంది. ఇటువంటి ఒక చురుకైన విమర్శకుడు , మేధావి, దాయార్ద్ర శ్రమజీవి, ఒక కర్మయోగి ఆ శతాబ్దచరిత్రలోనే అరుదుగా కనిపిస్తారు.
ధార్మిక విలువలతో లోతుగా నిలద్రొక్కుకున్న మహావృక్షము - డీవీజీ. ఆయన ధార్మిక సంప్రదాయవిలువలను సులభముగా, నిర్దుష్టముగా, వ్యక్తీక రించిన పద్ధతి అనితరసాధ్యము. ముఖ్యంగా ఆయన సంప్రదాయాలను స్వయముగా ఆచరించి పాటించిన మనీషి అందుచేతనే శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిపాదించిన - “ జ్ఞానినా చరితుమ్ శక్యం సమ్యక్ రాజ్యాది లౌకికమ్', వారి విషయములో సత్యము.
తనను ఒక పాత్రికేయుడు గానూ , సాహిత్య విద్యార్థిగానూ భారతీయ తత్త్వజ్ఞానం పట్ల అకుంఠిత విశ్వాసమున్న మనిషిగానూ చిత్రించుకుంటారు , దానినుండే తన జీవితమంతా స్ఫూర్తిని పొందినట్లు ప్రకటిస్తారు. ప్రముఖమైన వారి రచనలన్నీ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు రచించినవే . అది రాజకీయముగా , సమాజికముగా , ధార్మిక సంబంధముగా ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న సమయం. అందుకు సమాధానముగానే వారి రచనలు , ఉపన్యాసాలు వెలువరించారు. ఒక్కమాటలో వారిని వర్ణించాలంటే - ఆయన ఎన్నో విశిష్టత లను ప్రోది చేసుకొన్న దిగ్గజం - నవీన భారతానికి పురుజ్జీవనం ప్రసాదించిన ఒక వేదాంతి - ఒక జాతీయవాది - ఒక రాజనీతిజ్ఞుడు -
'తత్త్వ' అనే పదం ఆంగ్లంలో ' ఫిలాసఫీ ' గా చలామణి లో ఉన్నది. డీవీజీ - తత్త్వ - “That which is itself.” 'అది అదే ' అని నిర్వచించారు. 'తత్త్వ'యొక్క స్థాయీభావము - బ్రహ్మానుభవము. ఈ నిర్వచనము నుండి తెలిసే విషయము - జీవితము యొక్క ఏ లక్షణమైనా ఈ అనుభవ పరిధి లోనిదే. కాని ఆంగ్ల భాషలో పరిశీలిస్తే “experience” అనే మాట యొక్క అర్థం వ్యక్తిగత అనుభవము, సమాజ శాస్త్రము , మానవ పరిణామ శాస్త్రము ఆధారముగా నిర్మితమైన వాదముల పరిధిలోనిది మాత్రమే ఏడు దశకాలకన్నా ముందే డీవీజీ అటువంటి ఆంతరంగిక అనుభవాలకు పరిమితమైన నిర్వచనాలను సృష్టించడం జరుగుతుందనీ ముందే ఊహించి ఖండించారు, త్రిప్పికొట్టారు , హెచ్చరించారు. ఆయన భావాలు ఆత్మాశ్రయవాదాన్ని కాదనలేదు. ప్రపంచ వ్యాప్తంగా తేడాలు , భేదాలు సహజమే, అయితే అవి ప్రాపంచిక లావాదేవీల వరకే. అవి అనివార్య అరిష్టాలు, ఓపికతో ఎదుర్కొని దాటవలసినవి. వాటి పరిమితులను కూడా ఉటంకిస్తూ , డీవీజీ వాటిని అధిగమించేందుకు ఎన్నో సూచనలను చేశారు. అందులో 'లోకసంగ్రహము ' ఒకటి - అనగా ప్రతిఫలాపేక్ష లేకుండా లోకోపయోగము కొరకు పనిచేయుట, యోగి వలె ప్రవర్తించుట.వారి 'మంకుతిమ్మన కగ్గ ' లో ఈ పద్యము లోకసంగ్రహము యొక్క సారాన్ని ఎత్తి చూపుతుంది.
ಇರುವ ಕೆಲಸವ ಮಾಡು ಕಿರಿದೆನದೆ ಮನವಿಟ್ಟು ।
ದೊರೆತುದ ಹಸಾದವೆಂದುಣ್ಣು ಗೊಣಗಿಡದೆ ।।
ಧರಿಸು ಲೋಕದ ಭರವ ಪರಮಾರ್ಥವನು ಬಿಡದೆ ।
ಹೊರಡು ಕರೆ ಬರಲಳದೆ ಮಂಕುತಿಮ್ಮ ।।
అల్పమైన పని యైనా మనసు పెట్టి పనిచేయుము
భుక్తికి దొరికినదేదో దైవదత్త మేయనుకొని తృప్తిగా భుజించుము
మనస్సాక్షి కుందకుండ మనుగడ సాగించుము
అంతిమ పయనముముందరఅశ్రువులేల - మంకుతిమ్మ
అల్పుడు - అధికుడు అనే తారతమ్యాలు ప్రపంచంలో పూర్తిగా అంతరించేవి కావని డీవీజీకి తెలిసిన విషయమే. ఆయన మాటల్లో " మేము భేదాలను భగ్నం చేయాలనుకోవడం లేదు విచారణ చేసి భేదాలను తగ్గించే వివేకాన్ని కోరుతున్నాము " ఈ వివేకము మనలోని విలువలపై చైతన్యము ఉదయింపజేస్తుంది, ఆ విలువల తరతమ భేదముల గుర్తింపే - సాధన. సాధనద్వారా చిరకాలము నిలిచే విలువలను గుర్తెరిగి, ఇతరులు పాటించే విలువలను సమంజస దృష్టితో చూసే కారుణ్యము ఏర్పడుతుంది.
ఈ దృష్టి సనాతన ధర్మ అనుయాయులకు మాత్రమే కలుగుతుంది , నిశ్చయముగా డీవీజీ సనాతనవాదులైన మహామహులలో ఒకరు కదా. వారు - జీవన ధర్మ, అధిధర్మ అనే పదాలను కల్పన చేసి వాటి ద్వారా విశ్వనీతి సమన్వయాన్ని , అవసరమైనచోట్ల సర్దుబాట్లను సూచించారు . అటువంటి దృక్పథముతో సమానత లేని వివిధమైన - (1) పదార్థము - ఆత్మ/జీవము (2) ప్రాచ్యము - పాశ్చాత్యము (3) ఆంగ్లము - సంస్కృతము (4) రాజకీయము - సాంకేతికము (5) భాష - సంస్కృతి వంటి విషయాలలో కూడా ఏకవాక్యతను సాధించడానికి వీలయింది.
డీవీజీ గారి ప్రపంచ దృక్పథం ఆయన చిన్ననాటి విద్యార్థి దశలో సంప్రదాయిక గురూత్తములవద్ద అభ్యసించిన విద్య ద్వారానే రూపుదిద్దుకున్నది. వారి స్వగ్రామం కోలారు దగ్గరున్న ముళబాగిలు, అప్పట్లో ఎందరో మహాపండితులకు నెలవు. వారి విద్యాభ్యాసం అటువంటి వారి వద్దనే మొదలవడంతో జీవితాంతం విద్యార్థిగా ఎలావుండాలో నేర్పింది.
తరువాతి విద్యాభ్యాసం బెంగుళూరు లో జరిగినా మహామహోపాధ్యాయ హనగల్ విరూపాక్ష శాస్త్రి గారి వద్ద శిక్షణ,వారినివేదాంత విద్యలో నిష్ణాతుడిని చేసింది. డీవీజీతన గ్రంథము - ' జ్ఞాపక చిత్రశాలె ' లోగురువులు విరూపాక్ష శాస్త్రి గారిపై వ్యాసం వ్రాసి తన భక్తి ప్రపత్తులనుచాటుకున్నారు.
వారుసృజించినసాహిత్య ధారలోఎన్నో ప్రవాహాలు ప్రపంచ పరిస్థితులు , మానవ జీవితం, అనుభవాలు, ఉద్వేగాలు ఒకటేమిటి ఎన్నో. ఆయన కిష్టమైన పదం - ‘జీవన' అనగా జీవితం, దాని చుట్టూ ఆయన అల్లిన వ్రాతలన్నిటిలో మనము భగవంతునికి ఇవ్వగలిగినఉత్తమ సమర్పణమన జీవితాలనుస్వచ్ఛంగానూ , ప్రశాంతంగానూ ఉంచుకోవడమేనని ప్రకటిస్తాయి'దేవుడు' అనే భావన త్రోసివేయ దగినది కాదు. సమాజంలో నీతి నియమాలు, సామరస్య భావనలు నెలకొల్పడానికిభగవద్భావన తప్పనిసరి అని గుర్తించారు. అందుచేతభగవద్భావన ను సందేహపరంగాను , శ్రద్ధాళువుగాను - రెండు విధాలా పరిశీలించి రచనలు చేశారు.
ఆయన రచనలు మామూలు నిజజీవితంలో సంభవించే సంఘటనల ఆధారంగానే అంతర్నిహితమైన జీవితసత్యాలను ఆవిష్కరిస్తాయి. అటువంటివి ఎన్నోఉన్నాయి ,వానిలో తలమానికము గా చెప్పదగ్గవి - మంకుతిమ్మన కగ్గ , మరుళమునియన కగ్గ, జ్ఞాపక చిత్రశాలె, జీవనధర్మ యోగ, బాళిగోందు నంబికె అనునవి. తన పద్యములు ఆలోచనాత్మకమైనవని డీవీజీ స్వయంగానే చెప్పారు.
ఆయన సారస్వతములో తాత్త్విక భావనలు, అంతః శోధన సహాజసిద్ధముగానే వ్యక్తమవుతాయి. 1923 లో మిత్రుడికి వ్రాసిన ఉత్తరంలో:
నన్ను నేనే ఒక ధర్మవ్యవస్థగా చెప్పుకొనే పొరపాటు ఎందుకు చేస్తాను ? దురభిమానము గలవాళ్ళే తమను తాము అధికులుగా భావించి తాదృశమైన సంస్థలు తామే అనుకుంటారు.
'మంకుతిమ్మ కగ్గ' లోని ఒక పద్యంలో చివరిపాదంలో "నోరు కుట్టుకొని " ప్రపంచ హితముకొరకు పని చెయ్యి, అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని ప్రదర్శించకు. అని చెప్తారు డీవీజీ జీవితంలో ఆర్థిక సమస్యలు , ఆరోగ్య సమస్యలు , మరే ఇతర సమస్యలు వచ్చినా క్రుంగి పోలేదు , ఆశాభావంతో , మరింత ఉత్సాహంతో సమస్యలను ఎదుర్కొన్నారు, ఆయన జీవితమే ఒక జీవన పాఠం . అందుకే ఎమర్సన్ మాట - 'జీవితం సులభమైతే నేర్చుకునే పాఠాలుండవు'అని గుర్తురాక మానదు. లలితకళలు , సాహిత్యం విలాసానికి కాదు , పరిణతి చెందిన నాగరికమైన సజీవ సమాజానికి ప్రతీకలు . దారి చేరే గమ్యాన్ని చూసి డీవీజీ నడవలేదు, తానే నడిచి దారిని ఏర్పరచారు. ఈ విధముగా ఇతరులు చొరని ప్రాంతాలను జయించడం ద్వారా, తాను ఏర్పరచుకొన్న ఉన్నతాదర్శాలను నెరవేర్చుకోగలిగారు నాణ్యతలో , విస్తృతిలో , శైలిలో, పరిమాణము లో - ఏ కొలబద్దతో చూసినా డీవీజీ సాహిత్య భండారం మహోన్నతమైనది. ఆయన చేయని సాహిత్య ప్రక్రియ లేదు. జీవిత చరిత్రలు, పద్య రచనలు , నాటకములు , అనువాదాలు , పత్రికారచన. తత్త్వశాస్త్ర పరిజ్ఞానం కోరుకున్నా, మేధోమథనం కావాలన్నా, మానసిక ఆహ్లాద ఉత్తేజాలు కలగాలన్నా , ఆయన సాహిత్య భాండాగారం ఒక తరగని నిధి.
సమకాలీన కవులు దేశభక్తి మీదనో , మతసంబంధమైనవో , ప్రకృతి ఆరాధనపరంగానో రచనలు చేస్తున్న తరుణంలో ఆయన విజ్ఞాన శాస్త్రవేత్త ఆచార్య జే . సీ . బోస్ ను సన్మానిస్తూ వారు వ్రాసిన పద్యం ఎన్నో ప్రశంసలు పొందింది. సారస్వత, తత్త్వశాస్త్ర అధ్యయన తత్పరులైన విద్యార్థులకు వారి 'పదాలు', 'గేయాలు' , సాహిత్య విమర్శలు తప్పక చదువవలసినవే.
షేక్స్పియర్, టెన్నిసన్ , ఒమర్ ఖయ్యాం రచనల అనువాదాలు , అనుసరణలు ప్రపంచసాహిత్యాన్ని భారతీయులకు అందించాలనే డీవీజీ తపనను నిబద్ధతను అద్దం పడతాయి . ఆయన సమకాలికులు బ్రిటిష్ సాహిత్యాన్ని కన్నడం లోకి, ఇతర భారతీయ భాషలలోకి అనువదిస్తూ ఉండగా, గతకాలపు బ్రిటిష్ కాలనీల నుండి వచ్చిన రచయితలు , కవులు - వాల్ట్ వ్హిట్ మన్ పద్యాలను , రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రచనలను అనువాదం చేసి క్రొత్త ఒరవడిని సృష్టించారు.
వారి ఆరు దశాబ్దాల పాత్రికేయ జీవితం మహోన్నత ప్రమాణాలకు ప్రతీక. పాత్రికేయ వృత్తి ప్రజోపయోగమనో , ప్రజాస్వామ్యానికి జీవనాడియనో భావనయే కాకుండా దానిని మహోన్నత స్థాయిలో దర్శించారు. ఆయన ఆలోచనలు ' వృత్తపత్రికే' లో లిపిబద్ధం చేశారు. అది అంతగా గుర్తింపు పొందలేదు. పాత్రికేయునిగా పాశ్చాత్య పాత్రికేయులు డబ్ల్యూ.టీ .స్టెడ్ వంటి వారిని అభిమానించినప్పటికీ, ఆయన విధానం పూర్తిగా భారతీయమైనది. ఆయన సంపాదకీయాలు , పుస్తక సమీక్షలు , వ్యాసాలు , పిట్టకథలు , ఛిన్న కథలు , వ్యక్తిత్వ వర్ణనలు, ‘కర్ణాటక' ‘ ది ఇండియన్ రివ్యూ ఆఫ్ రెవ్యూస్ ' లో ప్రచురితమైన వారి విమర్శనాత్మక వ్యాసాలు ఏ పత్రికేయుడైనా , సంపాదకుడైనా చదివితీరవలసినవే, సేకరించి దాచుకోదగినవే.
ఆయన వ్యాసాలను - 'సెలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ డీ.వీ. గుండప్ప ' అనే పేరుతో రెండు సంపుటాలు ' గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ , బెంగుళూరు ' సంస్థ ప్రచురించింది. ఆసక్తిగల పాఠకులు ఈ పుస్తకాలను తప్పక కొనుక్కోవలసినదిగా నా సలహా. ఈ సంపుటాల కూర్పరులు డా. ఎస్ . ఆర్ . రామస్వామి, యువ విద్వాంసుడు బీ ఎన్ శశికిరణ్ గారలకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము.
కొనసాగించబడుతుంది
The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.